I will go upto any extent if Polavaram Project will be stopped, says AP CM Chandrababu Naidu. Every Monday Babu conducting review meeting regarding this project.
పోలవరం' ప్రాజెక్టు ఆగిపోయే పరిస్థితే వస్తే తాను ఎంతవరకైనా వెళతానని సీఎం చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. ప్రతి సోమవారం ఆయన'పోలవరం'పై సమీక్ష నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం సీఎం చంద్రబాబు స్వయంగా పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. కాఫర్ డ్యాం, డయాఫ్రం వాల్ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు పనులు జరుగుతున్న తీరు గురించి అక్కడి ఇంజనీర్లు ఆయనకు వివరించారు.
అనంతరం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కాంక్రీట్ వర్క్స్ మినహా ఇతర పనులు వేగవంతం చేశామని, కాంక్రీట్ పనులు పూర్తి చేసి కాఫర్ డ్యామ్ నిర్మిస్తే, వచ్చే ఏడాదిలో గ్రావిటీ ద్వారా నీళ్లు ఇవ్వొచ్చని అన్నారు. 'పోలవరం' ప్రాజెక్టు పై రూ.12,506 కోట్లు ఖర్చు చేశామని, పునరావాస ప్యాకేజి వల్ల ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.54 వేల కోట్లకు చేరుకుందని చెప్పారు. తొంభై ఎనిమిది వేల గిరిజన కుటుంబాలకు పునరావాసం కల్పించాల్సి ఉంటుందన్నారు. ప్రతి కుటుంబానికి సగటున రూ.18 లక్షలు చెల్లించాల్సి వస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు. 'పోలవరం' పై ప్రతిపక్షం అపోహలు సృష్టించి అడ్డుకోవాలని చూస్తోందని, అలాంటివి చేస్తుంటే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు.